రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా సరళతరం చేయాలన్న లక్ష్యంతో ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రెవెన్యూ శాఖకు అప్పగించింది. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. అయినప్పటికీ... కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి వెసులుబాటు కల్పించిన న్యాయస్థానం స్లాట్ బుకింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది.
రెండో రోజు కొంచెం మెరుగు...
ఈ నెల 14 నుంచి పాత విధానం ద్వారా న్యాయస్థానం నిర్దేశించిన మేరకు స్లాట్ల బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. మొదటి రోజు అమవాస్య కావడంతో 107స్లాట్లు బుకింగ్ అయ్యినా ...82 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో...ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో రోజున రిజిస్ట్రేషన్ చేసుకోడానికి రాష్ట్ర వ్యాప్తంగా 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో155 స్లాట్లు బుకింగ్ అయ్యాయి.
స్లాట్ బుకింగ్‌లో లోటుపాట్లు...
రిజిస్ట్రేషన్ల నిర్వహణలో ఇవాళ కూడా అనేక లోటుపాట్లు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా క్రయవిక్రయాలకు సంబంధించి కొనుగోలుదారుడు అమ్మకందారుడికి డబ్బు చెల్లింపులకు చెందిన వివరాలు నమోదుకు స్లాట్ బుకింగ్ ఫార్మ్‌లో అవసరమైన ఐచ్ఛికాలు లేవు. అమ్మకానికి పెట్టిన ఆస్తి తాలూకా...వివరాలుకాని, దాని ప్లాన్‌కాని అప్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. ఇందువల్ల ఆస్తికి చెందిన వివరాలు... తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆస్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తికి అది ఎక్కడ నుంచి ఏలా విక్రయదారుడికి వచ్చిందో... వివరాలు తెలియచేసే లింక్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసుకోడానికి అవకాశం లేదు. ఒకరికంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినా... అమ్మినా... వారికి చెందిన వివరాలు స్లాట్ బుకింగ్ ఫార్మ్‌లో నమోదు చేసుకోడానికి అవకాశం లేదు. ఆస్తిపన్ను గుర్తింపు నంబరు కలిగిన ఆస్తిలో కొంత భాగమే అమ్మినట్లయితే... కొనుగోలుదారుడికి ఎంత ఆస్తి బదిలీ అయ్యిందో... తెలియచేసే వివరాలు తెలుసుకోడానికి అవకాశం లేదు. ఆధార్ నంబరుకానీ... ఇతర వివరాలుకానీ ఒకసారి నమోదు చేసిన తరువాత పొరపాట్లు దొర్లినట్లు గుర్తించి వాటిని సవరించుకోడానికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఇందువల్ల స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలోనే పొరపాట్లు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా నమోదు చేసుకోవాల్సి వస్తోంది.
వాయిదా వేసుకునే అవకాశమే లేదు...
మార్టిగేజి రిజిస్ట్రార్‌లో డాక్యుమెంట్ల వివరాల నమోదుకు అవకాశం లేదు. ఏవైనా ప్రభుత్వ ఆస్తులుకానీ, వివాదంలో ఉన్నట్లయితే న్యాయస్థానం నుంచి వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేయాలని ఆదేశాలు వస్తే... వాటిని ప్రొహిబిషన్ జాబితాలో ఉంచడానికి అధికారులకు అవకాశం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ప్లాట్లుకాని, ఫ్లాట్లుకాని కొనుగోలు చేసిన వారు... బ్యాంకుకు పూర్తి రుణం చెల్లించిన తరువాత ఇచ్చే... రిలీజ్ ఆఫ్ డాక్యుమెంట్‌కు సంబంధించి కూడా ఎక్కడా ఆప్షన్ లేదు. స్లాట్ బుక్ చేసుకున్న తరువాత... ఏవైనా అవాంతరాలు ఎదురై... రిజిస్ట్రేషన్ వాయిదా వేసుకోడానికి అవకాశం లేదు. అదే విధంగా ఆస్తులు క్రయవిక్రయాల్లో... కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే అతని తరఫున మరొకరు హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 32 (ఎ) కల్పించిన అవకాశం ఇప్పుడు ఈ విధానంలో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా ఇబ్బందులు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
పదిరోజుల్లో పరిష్కారం..!
ఇప్పుడు నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో... కొన్ని లోటుపాట్లు ఉన్నాయంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నత అధికారులు... ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ పోతున్నామంటున్నారు. వారం, పది రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.