దేశంలోని థర్మల్ విద్యుత్‌లో కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మెరుగైన ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో 2021-22లో మొదటి స్థానంలో నిలవడంపై ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. మంచి దార్శనికతతో ప్రస్తుత స్థాయి నుంచి మరింత ఎదగడానికి లక్ష్యాలను నిర్థేశించుకుని ముందుకు సాగాలని ఉద్యోగులకు సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్ల పనితీరుపై సీఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నింటికన్నా ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి సగటున 87.18శాతం పీఎల్‌ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని... తెలంగాణ స్టేట్ జెన్ కో 73.98శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచిందని శ్రీధర్ వివరించారు. ఆ తర్వాత 70.29 శాతం పీఎల్‌ఎఫ్‌తో బంగాల్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉండగా.. 68.10 శాతంతో చత్తీస్‌గఢ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాలుగో స్థానంలో, 63.95 శాతంతో ఒడిశా పవర్ జనరేషన్ కార్పోరేషన్ ఐదో స్థానంలో, 58.83 శాతంతో ఆంధ్రప్రదేశ్ జెన్ కో ఆరో స్థానంలో నిలిచిందని తెలిపారు.
అదే విధంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మ్యానేర్ రిజర్వాయర్‌పై సింగరేణి నిర్మించ తలపెట్టిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌పై శ్రీధర్ సమీక్షించారు. డ్యాం వద్ద జరుగుతున్న సర్వే పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని, ప్రభుత్వ అనుమతి పొందిన వెంటనే మార్చి నెలలో టెండర్లు పిలవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం నుంచి పొందడానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు సూచించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని వాటర్ రిజర్వాయర్‌పై నిర్మించ తలపెట్టిన 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లో 5 మెగావాట్ల ప్లాంట్‌ను మార్చికల్లా పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: