Ganesh temple at Vanasthalipuram: హైదరాబాద్ వనస్థలిపురం గణేష్‌టెంపుల్‌లో నేటి నుంచి ఏప్రిల్ 10 వరకు శ్రీ మద్రామాయణ పారాయణ దీక్షాయజ్ఞం జరగనుంది. పవిత్రగ్రంథం రామాయణంలోని 24 వేల శ్లోకాలతో ప్రతీరోజు హోమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామయాణ శ్లోకాలతో ప్రత్యేక హోమాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 10న ఉదయం 10 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరిపేందుకు ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఏప్రిల్ 11న ఉదయం 9 గంటలకు శ్రీసీతారామ పట్టాభిషేకం జరపనున్నారు.
అందులో భాగంగా నేడు గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, రుత్విక్ గరణము, మండపారాధన, దీక్షా స్వీకరణ, శ్రీ మద్రామాయణ హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. రామాయణ పారాయణం వల్ల సకల దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున భక్త జనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారి పురుషోత్తమాచారి తెలిపారు.
ఇదీ చదవండి:Yadadri temple: నవ వైకుంఠం యాదాద్రి వైభవం.. అడుగడుగునా అద్భుతం.!