రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నా పలు సమస్యలపై స్పష్టత లోపించింది. కొన్ని అంశాలపై ఇప్పటికే ఆదేశాలిచ్చామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని సమస్యలపై విద్యాశాఖ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతుండగా వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేదీ లేనిదీ విద్యాశాఖ స్పష్టం చేయలేదు. 2019-20 సంవత్సరంలో మొత్తం 12,600 మంది విద్యా వాలంటీర్లు ఉండేవారు. ఈ సంవత్సరం వారిని పునర్నియమించలేదు. వారికి బదులు ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను(ఎస్‌జీటీలను) వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నా దానిపై నిర్ణయం తీసుకోలేదు.
ఒక్కో తరగతి గదికి 20 మందికి మించి విద్యార్థులు ఉండరాదు. ఆ సంఖ్య దాటితే రెండు సెక్షన్లు చేయాలి. ఈ పరిస్థితులు ఉంటే ఉపాధ్యాయుల కొరత తలెత్తనుంది. రాష్ట్రంలో 194 మోడల్ పాఠశాలలుండగా గంటల ప్రాతిపదికన దాదాపు 800 మంది ఉపాధ్యాయులు పనిచేసేవారు. ఇప్పుడు వారిని నియమించలేదు. ఆదిలాబాద్ లాంటి కొన్ని జిల్లాల్లో 17 చోట్ల కేవలం అలా పనిచేసే ఉపాధ్యాయులతోనే పాఠశాలలు నడుస్తున్నాయి. అలాంటి చోట్ల పాఠాలు చెప్పేవారే లేకుండా పోతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులను నియమించని పాఠశాల విద్యాశాఖ
ముఖ్యంగా పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే అంశం చిక్కుముడిగా తయారైంది. పారిశుద్ధ్య బాధ్యత స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలే చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సిబ్బంది మాత్రం తాము కేవలం స్వీపర్లమని, స్కావెంజర్లం కామని, ప్రాంగణాల్లో ఊడుస్తామని, మరుగుదొడ్లను శుభ్రం చేసే బాధ్యత తమది కాదని చెబుతున్నారు. 2018-19, 2019-20 సంవత్సరాలలో పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. 2020-21లో నియమించలేదు. గతంలో మాదిరిగా ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏటా పారిశుద్ధ్య కార్మికులకు ఖర్చు చేసేది రూ.63 కోట్లు కాగా అవసరమైన సమయంలో నాలుగు నెలలకైనా నియమించకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నాయి.
- ఇదీ చూడండి : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు ప్రారంభం