Public Opinion on Amaravati corporation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 19 గ్రామాలతో కాకుండా.. 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలని మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లింగాయపాలెంలో నిర్వహించిన గ్రామసభలో.. 19 గ్రామాలతో కూడిన అమరావతి కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు గ్రామస్తులు తెేల్చిచెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ లింగాయపాలెం గ్రామస్తులు చేతులు పైకెత్తడంతో.. ప్రజల అభీష్టాన్ని తీర్మానంగా అధికారులు నమోదుచేశారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తుళ్లూరు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.
ఇప్పటి వరకు గ్రామసభలు నిర్వహించిన గ్రామాలు..
- మంగళగిరి మండలం కృష్ణాయపాలెం
- తుళ్లూరు మండలం వెంకటపాలెం
- తుళ్లూరులోని లింగాయపాలెం, ఉద్ధండరాయినిపాలెం
ఏపీ ప్రభుత్వం కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని పాలిస్తుంది. విభజించు పాలించు అన్నరీతిలో వ్యవహరిస్తోంది. అసలు 29 గ్రామాలు కలిపితేనే అమరావతి. కానీ ఈ ప్రభుత్వం అమరావతిని విభజించి అమరావతి-1, అమరావతి-2 గా మారుస్తున్నారు. ఒకసారి మూడు రాజధానులు అంటారు. మరోసారి ఉన్న అమరావతిని ఇలా విభజిస్తున్నారు. మాకు19 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వద్దు. 29 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీనే కావాలి. వెంటనే ప్రభుత్వం స్పందించి 29 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీని ప్రతిపాదించాలి. లేదంటే మా పోరాటం మరింత ఉద్ధృతం చేస్తాం.
-లింగాయపాలెం గ్రామస్థులు
ఇదీచూడండి: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అరెస్టు