ఏపీలో నవంబర్ 29 నుంచి అమలు చేయనున్న విద్యాదీవెన కార్యక్రమానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది (key decisions approved by ap cabinet news). ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం 432 కొత్త 104 వాహనాల కొనుగోలు కోసం వైఎస్సార్ ఆరోగ్య శ్రీహెల్త్ కేర్ ట్రస్ట్‌కు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. అమరావతి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. డిప్యుటేషన్ విధానంలో 4 పోస్టులు, ఔట్‌సోర్సింగ్ విధానంలో 4 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.
శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం తితిదేకు అప్పగిస్తూ చట్టసవరణ కోసం బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ బొవైన్ బ్రీడింగ్ (రెగ్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ బొవైన్ సెమన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ సర్వీసెస్) బిల్లును ఆమోదించింది. నవంబర్ 16న జరిగిన ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. కడప జిల్లా కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు నాలుగు షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955కు సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది. రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమిని ముంబయికి చెందిన మహీంద్రా వేస్ట్ టు ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు 20 సంవత్సరాలపాటు లీజుకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాలయాల అభివృద్ది, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్, ఈఏఎఫ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లును అసెంబ్లీ ముందు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేయగా.., ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో సవరణలకు పచ్చజెండా ఊపింది. ఉన్నత విద్యాశాఖలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌లో సవరణకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. జవహర్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్శిటీ యాక్ట్ కు సంబంధించిన సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరును విజయనగరం జేఎన్టీయూ జీవీగా మార్పు చేసేందుకు అంగీకరించింది. ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం -1991లో సవరణలకు ఆమోదం తెలిపింది. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్‌ను పేర్నమిట్టకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్‌టీచర్స్ క్యాడర్) 2021 బిల్లుకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ పోస్టులు, 15 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 15 నాన్ టీచింగ్ పోస్టుల్లో ఒక పోస్టు పదోన్నతిపై, మిగిలిన 14 అవుట్ సోర్స్ పద్ధతిలో నియామకం చేపట్టాలని నిర్ణయించింది.
10 ఏళ్లకే విక్రయించుకునేలా..
ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది. కేటాయించిన ఇంటి స్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖజిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమిని గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు విమెన్ కో కంట్రిబ్యూటరీ పెన్షన్‌యాక్ట్ 2009కు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లతో రెండో వైస్‌ఛైర్మన్ పదవుల కోసం ఉద్దేశించిన సవరణలకు పచ్చజెండా ఊపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ఛైర్పర్సన్లు, ఇతర కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లను జిల్లా పరిషత్ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులుగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇదీచూడండి: Chandrababu news today: ఇది గౌరవ సభా.. కౌరవ సభా: చంద్రబాబు