పీటీఐ కథనం ప్రకారం... ఏపీ అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు ఏడుగురు తెదేపా సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభనుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి నిరసనగా సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. తెదేపా సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి తమ నిరసన తెలిపారు. కొంత సమయం సభ గందరగోళంగా మారింది. అంతకుముందు సభలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్, నిమ్మల రామానాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పట్టిస్తున్నారని, పదేపదే అబద్ధాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని సభాపతికి జగన్ విజ్ఞప్తి చేశారు. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడిపై చర్య తీసుకుంటామని స్పీకర్ ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రికార్డ్ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. తెదేపా సభ్యులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : గ్రేటర్‌లో తెరాసకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్