తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వన్యమృగాల దాడుల్లో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని, పంట నష్టం, పశుసంపద నష్టాలకూ ఇస్తున్న పరిహారాలను తెలంగాణ అటవీ అధికారులు అధ్యయనం చేశారు. వన్యమృగాల దాడుల్లో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న మానవ-జంతు సంఘర్షణ నివారణ కమిటీకి ప్రతిపాదనల్ని అందించారు. త్వరలోనే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
పెద్దపులి, చిరుత, ఎలుగుబంటి, అడవిపంది వంటి వన్యప్రాణులతో పాటు పాములు, కోతుల కారణంగానూ మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు శాశ్వతంగా అంగవైకల్యానికి గురవుతున్నారు. అడవిపందులు, జింకలు, కోతుల కారణంగా రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. పులులు పశువుల్ని చంపి తింటున్నాయి. ఇలాంటి ఘటనలతో ఆయాప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ-జంతు సంఘర్షణ నివారణతో పాటు నష్టపరిహారాల పెంపుపైనా ప్రత్యేక కమిటీ దృష్టి పెట్టింది. పరిహారంపై ప్రతిపాదనలు సమరించింది.
పంటనష్టం జరిగితే : ఎకరాకు రూ.6 వేలు ఉండగా.. తాజా ప్రతిపాదనల్లో ఆ మొత్తాన్ని రూ.7,500కి పెంచారు. ఇతర ఉద్యానపంటలకు ఎకరాకు రూ.7,500 నుంచి గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఉండగా గరిష్ఠ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించారు.
పశువులు చనిపోతే : మార్కెట్లో పశువు ధరను చెల్లిస్తున్నారు. అయితే ఆ మొత్తం రూ.25 వేలకు మించొద్దని అటవీశాఖ తాజాగా ప్రతిపాదించింది.
అలా ఐతే పరిహారం రాదు: రక్షిత అటవీప్రాంతాలు, అభయారణ్యాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి పశువులు, మేకలు వలస వచ్చి వన్యమృగాల దాడిలో మరణిస్తే పరిహారం లేదని అటవీశాఖ స్పష్టంచేసింది.
మహారాష్ట్రలో రూ.15 లక్షల పరిహారం
వన్యప్రాణుల దాడుల్లో మనిషి చనిపోతే మహారాష్ట్రలో రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నారు. దేశంలో అత్యధిక పరిహారం అక్కడే ఇస్తున్నారు. తెలంగాణలో రూ. 5 లక్షలు ఉండగా 7.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. 30 రోజుల్లోగా క్లెయిమ్‌ను పరిష్కరించాలని.. బాధిత కుటుంబానికిచ్చే పరిహారంలో 50శాతం మొత్తాన్ని బ్యాంకు/పోస్టాఫీసుల్లో దీర్ఘకాల డిపాజిట్ రూపంలో ఉండాలని పేర్కొంది.