సచివాలయ కార్యాలయాల తరలింపు పూర్తయింది. ఇప్పటికే చాలా దస్త్రాలను తరలించగా... గత రెండు రోజులుగా మిగతా కార్యాలయాలను తరలించారు. నిన్న రాత్రి వరకు సచివాలయంలోని కార్యాలయాల తరలింపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా శని, ఆది వారాల్లో కార్యాలయాల తరలింపు యుద్దప్రాతిపదికన సాగింది. డి బ్లాక్‌లో ఉన్న మంత్రుల కార్యాలయాలతో పాటు ఇతర బ్లాకుల్లోని విభాగాలను తరలించారు. మంత్రులు బీఆర్కే భవన్లో కాకుండా అనువైన ఇతర ప్రాంతాల్లో తమ కార్యాలయాలను ఎంచుకున్నారు. అందుకు అనుగుణంగా కార్యాలయాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల కోసం గత మంత్రులు ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్‌ను కేటాయించారు.
త్వరలో బ్యాంకుల తరలింపు..
ఇక నుంచి సచివాలయంలోకి అధికారులు, ఉద్యోగులు, ఇతరులను అనుమతించబోరు. ఎవరైనా అత్యవసరాల కోసం వెళ్లాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్‌లు మాత్రమే ప్రస్తుతం సచివాలయంలో ఉన్నాయి. సీఈఓ కార్యాలయాన్ని బుద్ధభవన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. హుజూర్నగర్ ఉపఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో తరలింపునకు కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. బ్యాంకుల కోసం బీఆర్కే భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధమయ్యే వరకు బ్యాంకులు సచివాలయంలోనే కొనసాగుతాయని... త్వరలోనే బ్యాంకుల తరలింపు కూడా పూర్తవుతుందని చెబుతున్నారు.
బీఆర్కే భవన్ కేంద్రంగా రాష్ట్ర పాలన
కార్యాలయాల తరలింపు పూర్తి కావడం వల్ల ఇక నుంచి బీఆర్కే భవన్ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కార్యాలయాలు బేగంపేట రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్ నుంచి నడుస్తున్నాయి. మంత్రుల కార్యకలాపాలు వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల నుంచి నడవనున్నాయి. బీఆర్కే భవన్ వద్ద సీసీకెమెరాలు సహా ఇతర భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. సచివాలయంలోని ఇతర కెమెరాలను అక్కడకు తరలించనున్నారు.
త్వరలో కొత్త సచివాలయ నిర్మాణం
తరలింపు పూర్తి కావడం వల్ల ఇక కొత్త సచివాలయ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించనుంది. ప్రస్తుత భవనాలను తొలగించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా నమూనా కూడా ఖరారు చేసి కొత్త నిర్మాణాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇవీ చూడండి: సచివాలయంలో తెలంగాణ ప్రవేశద్వారానికి తాళం