ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్(IT Minister KTR) నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు.. పలు కంపెనీల సీఈఓలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్స్, మిస్సైల్ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతి గాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్ సోలోమియాక్, పాల్ నీల్ లే లివెక్, ఇతర ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.
పెట్టుబడుల అవకాశాల వివరణ..
ఏరోక్యాంపస్ అక్విటైన్ సంస్థ డైరెక్టర్ జేవియర్ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్ అష్రాఫ్‌తో సమావేశమైన కేటీఆర్... వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్ వ్యాలీ క్లస్టర్ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెర్యూతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భారతదేశ కాస్మోటిక్ మార్కెట్ గురించి ఫ్రాంకీకి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్ తయారీ అవకాశాలను తెలియజేశారు.
మొదటి రోజు సాగిందిలా..
తొలిరోజు అక్కడి ప్రభుత్వ డిజిటల్ వ్యవహారాల రాయబారి హెన్రీ వెర్డియర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో డిజిటల్ సాంకేతికత, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ డిజిటల్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల గురించి వెల్లడించారు. రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్ డేటా విధానాన్ని కేటీఆర్ వివరించారు. ఆవిర్భవించిన అనతికాలంలో తెలంగాణ గొప్ప సాంకేతిక ప్రగతిని సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా వెర్డియర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్, వెర్డియర్‌లు డిజిటలీకరణ, ఓపెన్‌డేటా, ఆవిష్కరణల రంగాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారానికి అంగీకరించారు. తెలంగాణ అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఆ దేశంలోని అంకుర సంస్థలకు తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార, వాణిజ్య అవకాశాల కల్పనకు నిర్ణయించారు.
29న కేటీఆర్ కీలకోపన్యాసం..
ఈ నెల 29వ తేదీన ఫ్రెంచ్ సెనేట్లో యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు 29న యాంబిషన్ ఇండియాలో మంత్రి కేటీఆర్ (IT Minister KTR) కీలకోపన్యాసం చేయనున్నారు. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యులు, కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. 'గ్రోత్ డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్‌కొవిడ్ ఎరా' అనే అంశంపై కేటీఆర్ (IT Minister KTR) తన అభిప్రాయాలు పంచుకుంటారు.
ఇవీ చూడండి: