Fever Survey: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో భాగంగా రెండో రోజు వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నాయా..? అంటూ ఆరోగ్య కార్యకర్తలు ఆరా తీసి... అనుమానిత లక్షణాలున్నవారికి వెంటనే మెడికల్ కిట్లు అందించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. వివిధ వార్డుల్లో తిరిగిన మంత్రి..స్థానికులు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. ఒమిక్రాన్ అంత తీవ్రం కానప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
'జ్వరం సర్వేలో ఇంటింటిని నేను పరిశీలిస్తున్నా. ఇప్పటికీ కొందరు సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిసింది. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి. రెండో డోసును కచ్చితంగా తీసుకోవాలి. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇస్తున్నాం. పిల్లలకు కూడా టీకా ఇస్తున్నాం. 15-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చింది. అర్హులైన అందరూ టీకా తీసుకోవాలి.'
-హరీశ్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి
జ్వర సర్వేలో వైద్య సిబ్బందికి సహకరించాలని ప్రజలకు రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా సమీక్షాసమావేశంలో సూచించారు. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. తద్వారా ప్రాణాపాయం తప్పించుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ ముషీరాబాద్ మేదరబస్తీ, అంబర్ పేటలో జ్వర సర్వేను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. కాలనీవాసుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లక్షణాలున్నవారు ప్రభుత్వ మెడికల్ కిట్లు వాడితే సరిపోతుందని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించొద్దన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరుతెన్నులను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అధికారులను అడిగితెలుసుకున్నారు. టీకాలు వేసుకోవడంతో పాటు ప్రభుత్వం సూచించే కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఇదీ చూడండి: