SCHOOLS REOPEN IN AP: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ఏదీ లేదని.. ఇంతకుముందు ప్రకటించినట్లే సోమవారం నుంచి యధావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ‘ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92% మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై డేగకన్నుతో నిఘా ఉంచింది. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మంత్రి వివరించారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని విద్యామంత్రి వెల్లడించారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆ రాష్ట్రంలో పాఠశాలలన్నీ ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనల నడుమ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు 30 వరకు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ నెల తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఆదివారంతో ఈ గడువు ముగిసింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.