మాది ఏపీలోని విజయవాడ. చిన్నప్పుడు నేను బరువు తగ్గాలని అమ్మ నన్ను నృత్యంలో చేర్పించింది. కారణమేదైనా నాకు మాత్రం నృత్యం అంటే ప్రాణంగా మారింది. అందుకే జీవీఆర్ మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా చేశా. ఆ తర్వాత కూచిపూడి కళాక్షేత్రలో ఎమ్‌ఏ డ్యాన్స్ పూర్తి చేశా. పెళ్లైన తర్వాత హైదరాబాద్ వచ్చా. కూచిపూడి నృత్యప్రదర్శనలిస్తూ, సొంతంగా ‘శారదా కళాక్షేత్ర డాన్స్ అకాడమీ’ స్థాపించి 150 మంది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణనిస్తున్నా.
రోడ్డున పడి...
ఫేస్‌బుక్‌లో మా రంగంలో ఉన్నవారందరికీ ఓ గ్రూప్ ఉంది. గతేడాది మార్చి మొదటివారంలో అందులో ఓ పోస్ట్‌ను చూశా. ఓ నృత్యకళాకారుడి ఆవేదన అది. ఆ ఫొటోను చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. కడుపులో మెలిపెట్టినట్లు అయ్యింది. ఆయన చిత్తూరుకు చెందిన ఓ కూచిపూడి కళాకారుడు. కొవిడ్ కారణంగా ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ రోజంతా ఆయన నా కళ్లెదుటే ఉన్నట్లనిపించింది. ఏదో ఒకటి చేయాలని ఆలోచించా. వెంటనే తెలిసిన వారందరినీ సంప్రదించా. ఇలా మరెందరో కళాకారులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా.. అటువంటి వారందరినీ ఆదుకోవాలనిపించింది.
‘సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్’...
కూచిపూడి శిక్షణా పథకం కింద దాదాపు 400 మంది కళాకారులకు గతంలో ఉద్యో గాలుండేవి. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉపాధి కోల్పోయారు. తర్వాత వారంతా ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూపును సంప్రదించా. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులందరికీ చేయూతనివ్వడానికి నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఓ ఆలోచన వచ్చింది. ‘సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్’ పేరుతో ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రాం ప్రారంభించా. ఇందులో రోజుకొక కళాకారుడితో వారి కష్టాలను చెప్పించేదాన్ని. ప్రభుత్వం చేయుత´తనివ్వాలని కోరేదాన్ని. రెండుమూడు గంటలపాటు జరిగే ఆ కార్యక్రమం సోషల్‌మీడియాలో చాలా స్పందనను తెచ్చింది. లైవ్ మొదలైన రెండో రోజునే కూచిపూడి కళాకారుడు వెంపటి వెంకట్ స్పందించారు. ఆ తర్వాత మరెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆర్థికంగా చేయూతనందించడానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ నగదుని ఓ ట్రస్టు ద్వారా సేకరించాం. మరోవైపు దయనీయ స్థితిలో ఉన్న నృత్యకళాకాలందరినీ గుర్తించడానికి జిల్లాలన్నింటిలో వాలంటీర్లుగా పనిచేయడానికి కొందరు ముందుకొచ్చారు. ఇలా ఆంధ్రాలో 600, తెలంగాణలో 800 మంది కళాకారులను గుర్తించి అందరికీ తక్షణసహాయంగా తలా రూ.1000 చొప్పున ముందుగా అందించాం. హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో ఉండేవారికి నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం. అలా నాలుగునెలలపాటు పేద కళాకారులకు సాయం అందేలా కృషి చేశా. దేశంలోనే కాదు.. అమెరికా, లండన్ దేశాల నుంచి కూడా పలువురు కళాకారులు తమ వంతు చేయూతనందించారు. ఒక్కొక్కరు రూ.500 పంపితే, మరొకరు రూ. లక్ష కూడా ఇచ్చారు. ఆ నాలుగు నెలలూ ఓ కార్పొరేట్ సంస్థ సిబ్బందిలా పని చేశాం. వృద్ధులకు ఆసుపత్రి ఖర్చులు తలా ఐదువేలు పంపించేవాళ్లం. మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆర్థికసాయంతోపాటు నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం.
పింఛను ఇప్పించి...
లాక్‌డౌన్ తర్వాత కళాకారులకు ఉపాధి దొరకడం కష్టమైంది. దాంతో పలు కార్పొరేట్ సంస్థల సహాయం తీసుకుంటున్నాం. ఆలయాల్లో కళాకారుల నృత్యప్రదర్శన ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జేఎస్‌పీఎల్ సంస్థ ద్వారా 12 మంది వృద్ధకళాకారులకు వారి జీవితాంతం తలా రెండున్నరవేల రూపాయలు నెలనెలా పింఛను అందేలా చేశా. దానికి కన్నీళ్లతో వారు చెప్పే కృతజ్ఞతలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. త్వరలో అంతర్జాతీయ కూచిపూడి సమాఖ్యను ప్రారంభించనున్నా. ఇందులో ప్రతి కళాకారుడు సభ్యుడిగా చేరొచ్చు. వెంపటి చినసత్యంగారి జ్ఞాపకార్థం ఏటా అక్టోబరు 15న ‘వరల్డ్ కూచిపూడి డే’గా జరుపుకోవడం గతేడాది నుంచి ప్రారంభించాం.
-డాక్టర్ భావన,సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్.