samsung decision against russias invasion in ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి తమ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్ సైతం ఇప్పటికే రష్యాలో తమ ఉత్పత్తుల విక్రయాలను ఆపేశాయి.
ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్ని దగ్గరి నుంచి పరిశీలిస్తున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్ చిప్స్ దగ్గరి నుంచి స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా ఇతరత్రా ఉత్పత్తలన్నింటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా దాడుల వల్ల ప్రభావితం అవుతున్న ప్రతి ఒక్కరి గురించి తాము ఆందోళన చెందుతున్నామని తెలిపింది. తమ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతే ప్రస్తుతం తమ ప్రథమ కర్తవ్యవమని పేర్కొంది.
అలాగే ఉక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని శాంసంగ్ ప్రకటించింది. ఇందులో 1 మిలియన్ డాలర్ల విలువ చేసే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయని తెలిపింది. ఉక్రెయిన్‌లో రోజురోజుకీ పరిస్థితులు ఆందోళకరంగా మారుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా చేసిన దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో అమెరికా, యూకే సహా అనేక దేశాలు రష్యా చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి.
ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పతనమవుతోంది. ఫలితంగా రష్యాలో కార్యకలాపాలు నిర్వహించడం విదేశీ సంస్థలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో తమ ఉత్పత్తుల విక్రయాలను, సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యాపిల్, మైక్రోసాఫ్ట్ ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో శాంసంగ్ సైతం చేరింది.
ఇదీ చూడండి: భీకర దాడులకు తాత్కాలిక విరామం.. రష్యా కాల్పుల విరమణ ప్రకటన