Sajjala Ramakrishna Reddy on Employees Protest: పీఆర్సీపై ఉద్యోగుల అపోహలు తొలగించేందుకు మెట్టు దిగేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని హితవు పలికారు. చర్చల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో సిద్ధంగా ఉందన్న ఆయన.. రేపు కూడా అందుబాటులో ఉంటామని వెల్లడించారు. పీఆర్సీ సాధన సమితి, ఇతర సంఘాలు వచ్చినా అందుబాటులోనే ఉంటామని పేర్కొన్నారు.
ఉద్యోగుల డిమాండ్లను సీఎంతో చర్చించి పరిష్కరానికి ప్రయత్నిస్తామని సజ్జల తెలిపారు. ఉద్యోగుల ప్రతినిధులు వచ్చి చర్చిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ట్రెజరీ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించటం క్రమశిక్షణారాహిత్యమని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం ఏముందన్నారు. దుందుడుకు వైఖరి, ఒంటెత్తు పోకడలతో వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులు చర్చలకు రావాలి - మంత్రి బొత్స
'సమస్యకు పరిష్కారం కోరుకుంటే ఉద్యోగసంఘాలు చర్చలకు రావాలి. చర్చించుకుంటేనే కదా ఎక్కడైనా సమస్యలు పరిష్కారమయ్యేది. ఇవాళ చర్చలకు రావాలని అందరినీ ఆహ్వానించాం' - మంత్రి బొత్స సత్యనారాయణ
ఉద్యోగుల ఉద్యమం ఉద్ధృతం...
AP govt Employees Stage Protests : మరోవైపు పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్, గుంటూరులో కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్నారు.
PRC GOs issue in ap: కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైయ్యాయి. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, శివారెడ్డి దీక్షలను ప్రారంభించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు రావడం లేదంటూ మంత్రులు కమిటీ పదేపదే చెప్పడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. మూడు రోజుల క్రితమే తాము తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని చర్చలకు పంపించామని స్పష్టం చేశారు. ఆ కమిటీ ద్వారా తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పకుండా తమపై నిందారోపణలు మోపడం తగదన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తప్పుదోవ పట్టించేందుకు కుట్ర - బండి శ్రీనివాసరావు
"చర్చలకు పిలిచినా ఉద్యోగులు రావట్లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చర్చల పేరిట తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర. 12సార్లు చర్చలకు వెళ్లినా మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదు. ప్రభుత్వం 3 నెలలుగా ఆశ చూపుతూ వెనక్కి వెళ్తోంది. ఉద్యోగుల ఆప్షన్ తీసుకున్నాకే పీఆర్సీ అమలు చేయాలి. జీతాలు తీసుకోవట్లేదనే నెపం పెట్టాలని ప్రభుత్వం యోచన. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఆగిపోనున్నాయి. డిమాండ్లపై ప్రభుత్వ వైఖరి చెప్పే వరకు చర్చలకు వెళ్లేది లేదు" - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి :