రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు(saddula bathukamma 2021) అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రంగురంగుల పట్టుచీరలు, పట్టుపరికిణీలు.. ఒళ్లంతా నగలతో ఆడబిడ్డలంతా సింగారించుకుని ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగిపోయాయి.
సీఎం శుభాకాంక్షలు..
పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ(saddula bathukamma 2021) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు(saddula bathukamma wishes in telugu) తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
మారుమోగిపోయిన గ్రామాలు..
రాష్ట్రంలోని చాలా చోట్ల సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో వేడుకల్లో హాజరయ్యారు. మహిళలంతా ఉత్సాహంగా.. ఉయ్యాల పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు. రకరకాలు పాటలతో.. వివిధ రూపాల నృత్యాలతో.. ఊళ్లన్ని ఉత్సాహంతో ఊగిపోయాయి. కొన్ని చోట్ల డీజేల్లో బతుకమ్మ పాటలు పెట్టి.. కోలాటాలతో యువతులు హోరెత్తించారు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు.. అందరూ బతుకమ్మ ఆటల్లో కాలు కదిపారు. రకరకాల నృత్య రీతులతో.. ఆనందంగా పండుగను ఆస్వాదించారు.
ప్రగతి భవన్‌లో సద్దుల సందడి
ప్రగతి భవన్‌లోనూ సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరితో కలిసి బతుకమ్మ ఆడుతూ ముసిపోయారు. నిజామాబాద్లో వైభవంగా జరిగిన సద్దుల సంబురంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తోటి మహిళలతో కలిసి కాలుకదిపారు. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి.. అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగ తర్వాత కరోనా జాగ్రత్తలు తీసుకుని సురక్షింతంగా ఉండాలని సూచించారు.
చెరువులకు చేరిన పూల సింగిడి..
తనివితీరా ఆటలు ఆడుకున్న మహిళలు.. అనంతరం బతుకమ్మను సాగనంపేందుకు చెరువులకు చేరుకున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు ఆయా చెరువుల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. "పోయిరా బతుకమ్మ.. పోయి మళ్లీ రా బతుకమ్మ.." అంటూ.. సాగనంపారు. చెరువులు మొత్తం బతుకమ్మలతో మెరిసిపోయింది. ఆ తర్వాత.. చెరువు కట్టలపైన మహిళలంతా కూడి.. బతుకమ్మకు నైవేద్యంగా పెట్టిన రకరకాల ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. పసుపుబొట్లు పెట్టుకుంటూ.. సందడి చేశారు. ఇళ్లకు తిరిగొచ్చిన అనంతరం.. కోలాటాలు, దాండియాలు ఆడుకుంటూ పండుగను ఎంజాయ్ చేశారు.
కొన్ని చోట్ల రేపు సద్దులు..
ఈసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను రేపు జరుపుకోనున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలను ప్రకటించడంతో సద్దుల బతుకమ్మ పండగను ఈరోజుతో పాటు పలు చోట్ల రేపు(గురువారం) కూడా జరుపుకోనున్నారు.
ఇవీ చూడండి: