ఆర్టీసీ కార్మికులు రేపు బస్ డిపోల వద్ద నిరసన తెలిపి... స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరుతామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. ఎల్లుండి కూడా నిరసన కొనసాగిస్తామని.... జాతిపిత మహాత్మా గాంధీ, ఆచార్య జయశంకర్ విగ్రహాల వద్ద రెండు గంటల పాటు మౌన ప్రదర్శన నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగినా... ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. డిమాండ్లను సాధించుకునే వరకు వెనక్కి తగ్గేదిలేదని.... ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని నేతలు తెలిపారు. ప్రభుత్వం తీరును, హైకోర్టు కేసు వివరాలను ఆర్టీసీ ఐకాస నేతలు... రాజకీయ పార్టీల నేతలకు వివరించారు. సమ్మెకు మద్దతు కొనసాగించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని... ప్రజా రవాణాను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించాలనే ఉద్దేశంతోనే సమ్మె కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతు ఇస్తామని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు.
ఇవీ చూడండి: రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ