Statue Of Equality at Muchintal: సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ్రీరామనగరం వందలాది మంది సాధువులు, పీఠాధిపతులతో నిండిపోయింది. సమతామూర్తి కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు సందర్శించారు. ముందుగా.. జీవా ఆశ్రమంలో చినజీయర్ స్వామితో మోహన్ భగవత్, శివరాజ్‌సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. అనంతరం చినజీయర్‌స్వామితో కలిసి యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో మోహన్ భగవత్, శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనంలో సమతాస్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లిన చినజీయర్‌స్వామి.. 108 దివ్యక్షేత్రాల విశిష్టతలను అతిథులకు వివరించారు.
సమతామూర్తి విగ్రహం స్ఫూర్తితో..
చినజీయర్‌స్వామి ప్రవచనాలు వింటే రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా మార్చుకోవచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. లోక కల్యాణం కోసం ఆయన చెప్పే మాటలు ఎంతో స్ఫూర్తిగా ఉంటాయన్నారు. చినజీయర్ స్వామి నెలకొల్పిన సమతామూర్తి విగ్రహం స్ఫూర్తితో ఒంకారేశ్వర్‌లో స్టాచు ఆఫ్ వన్ నెస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రభుత్వాల ఆలోచనలు ప్రజలకు న్యాయం చేసే విధంగా మారాలన్నారు. సమతామూర్తి కేంద్రానికి వస్తే యువత ఆలోచనా విధానం మారుతుందన్నారు. సనాతన ధర్మం మనిషిని దేశ హితం వైపు నడిపిస్తుందనడానికి సమతామూర్తి కేంద్రం నిదర్శనమన్నారు.
ధర్మాచార్య సదస్సులో సాధుసంతులు..
ధర్మాచార్య సదస్సులో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధు సంతులు విచ్చేశారు. ఉదయం యాగశాలలో అష్టోత్తర మంత్ర జపం పూర్తైన తర్వాత సాధుసంతులతో సమావేశమైన చినజీయర్ స్వామి... వారితో కలిసి సమతామూర్తి కేంద్రంలో పర్యటించారు. సమతామూర్తి కేంద్ర విశేషాలను వివరించారు. భద్రవేదిలో పద్మపీఠంపై కొలువైన 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహ సందర్శనతో పాటు పరిక్రమలో ఏర్పాటు చేసిన 108 దివ్యదేశాల విశిష్టతలను వారితో పంచుకున్నారు.
పటిష్టమైన బందోబస్తు..
మరోవైపు రేపు, ఎల్లుండి దివ్యదేశాల్లో మరికొన్ని ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. అటు ప్రవచన మండపంలో వందలాది మంది భక్తులు హయగ్రీవ అష్టోత్తర నామ పూజలో పాల్గొన్నారు. అతిథుల రాకతో సమతామూర్తి కేంద్రంలో పోలీసు బలగాలు పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: