ఐపీఎస్ అధికారిగా పదవీత్యాగం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలో చేరనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 8న నల్గొండలో నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్పసభలో పార్టీ జాతీయ కోఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతం నేతృత్వంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నచ్చక ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ పదవులను సైతం త్యాగం చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. సమాజంలో అణచివేత, అసమానతలు ఎదుర్కొంటున్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్న సంకల్పం కోసం తన ఆరున్నరేళ్ల పదవిని ప్రవీణ్ కుమార్ త్యాగం చేసినట్లు పేర్కొన్నారు. నల్గొండలో జరిగే ఈ సభకు బహుజనులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ కోరారు.
బహుజనులకు రాజ్యాధికారం కోసం..
"సమాజంలో వివక్షకు గురవుతున్న బహుజనులను చూసి చలించిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. తన విలువైన ఉన్నతపదవికి రాజీనామా చేశారు. ఎలాగైనా బహుజనులకు రాజ్యాధికారం దక్కేందుకు రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురించి తెలిసిన వాళ్లుగా.. బహుజనులకు తనకు ప్రేమ, సిద్ధాంతం నచ్చి.. బీఎస్పీలోకి ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి.. పార్టీలోకి రావటానికి ప్రవీణ్‌కుమార్ ఒప్పుకున్నారు. ఈ నెల 8న నల్గొండలో జరిగే సమావేశంలో పార్టీలో చేరుతారు. ఈ సమావేశానికి బహుజనులు పెద్దఎత్తున వచ్చి.. విజయవంతం చేయాలి"- మంద ప్రభాకర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చూడండి: