విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. దేశంలోకి గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.4,37,188 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అందులో అత్యధికంగా 37.46% వాటాతో కర్ణాటక తొలిస్థానంలో నిలవగా.. 26.78% పెట్టుబడులు సాధించి మహారాష్ట్ర రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఏడాది మొత్తం ఎఫ్‌డీఐల్లో ఈ రెండు రాష్ట్రాల వాటానే 64.24% ఉండడం విశేషం. అదే సమయంలో తెలంగాణకు రూ.11,965 కోట్ల (2.73%) పెట్టుబడులు వచ్చాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు తర్వాత స్థానాన్ని, దేశవ్యాప్తంగా 7వ స్థానాన్ని తెలంగాణ దక్కించుకొంది. ఆంధ్రప్రదేశ్ కేవలం రూ.1,682 కోట్ల (0.38%) ఎఫ్‌డీఐలకు మాత్రమే పరిమితమై టాప్ 10లో స్థానాన్ని కోల్పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరు రాష్ట్రాలు ఒక్కోటి రూ.20 వేల కోట్లకుపైగా పెట్టుబడులను దక్కించుకున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 92.74% ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల వాటా కలిపి 7.25%కి పరిమితమైనట్లు కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం సమాచారాన్ని బట్టి తేలింది.
2019 అక్టోబరు నుంచి రాష్ట్రాలవారీగా లెక్కలు..
2019 సెప్టెంబరు వరకు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఎఫ్‌డీఐలను లెక్కిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఏడాది అక్టోబరు నుంచి రాష్ట్రాలవారీగా లెక్కలు కడుతోంది. దాని ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2021 మార్చి వరకు దేశంలోకి రూ.6,14,127 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.10,51,315 కోట్లకు చేరింది. అంటే 12 నెలల్లో నెలకు రూ.36,432 కోట్ల చొప్పున రూ.4.37 లక్షల కోట్లు దేశంలోకి వచ్చాయి. గత ఏడాది వరకు మొత్తం పెట్టుబడుల్లో మొదటిస్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. తొలి రెండు స్థానాలను మహారాష్ట్ర (రూ.2.88 లక్షల కోట్లు), కర్ణాటక (రూ.2.51 లక్షల కోట్లు) ఆక్రమించాయి. 2019 అక్టోబరు నుంచి ఇప్పటివరకు తెలంగాణకు రూ.25,447 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,796 కోట్ల విదేశీ పెట్టుబడులు మాత్రమే దక్కాయి. సర్వీస్ సెక్టార్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లోకే అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. అందులో సింహభాగం అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, మారిషస్, సింగపూర్‌ల నుంచి వచ్చాయి.