Chicken Price Hike: నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎండలు మండిపోతుండటం కోళ్ల పెంపకం తగ్గిపోతుండటంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో స్కిన్‌లెస్ రూ.280-300 పలుకుతోంది. నెల క్రితం రూ.150 నుంచి రూ.180 మధ్య ఉన్న ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. నెల వ్యవధిలోనే ఏకంగా రూ.100కి పైగా పెరగడం గమనార్హం. అటు ఆంధ్రప్రదేశ్లోనూ కేజీ చికెన్ ధర రూ.300 మార్కును దాటేసింది.
జూన్ వరకు ఇంతేనా..
గ్రేటర్‌లో రోజుకు 2.5 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు జరుగుతాయి. ఆదివారం రోజు 3లక్షల కిలోలకు పైగా అమ్మకాలుంటాయి. కరోనా భయం కాస్త తగ్గడంతో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా వేసవిలో చికెన్ విక్రయాలు తగ్గుతాయి. వేడి ఎక్కువగా ఉండే చికెన్ తినేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపరు. ఈసారి ఆ పరిస్థితి లేదు. గతేడాది ఇదే సమయానికి కిలో ధర రూ.200గా ఉంటే ప్రస్తుతం రూ.100 పెరిగింది. కరోనా ప్రభావం, దాణా ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. సాధారణంగా ప్రతి వేసవిలో చికెన్ ధరలు పెరుగుతాయి. ఎండకు కోళ్లు చనిపోవడం, రైతులు తక్కువగా పిల్లల్ని వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుత ధరలు వేసవిలో ఉండాల్సిన దానికి మించి ఉన్నాయి. ఈ ధరల పెంపు మున్ముందు ఉంటుందని పేర్కొంటున్నారు. జూన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చూడండి: నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి