పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 10 లక్షల రూపాయల విలువైన సిరా, స్కెచ్ పెన్నులను ఉపయోగించనున్నారు. కర్నాటకకు చెందిన మైసూర్ పెయింట్స్ కంపెనీ నుంచి వాటిని ప్రత్యేకంగా తెప్పించారు. ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాల నుంచి 10 లక్షలా నలభై వేలకుపైగా ఓటర్లున్నారు.
ఈ నెల 14న జరగనున్న పోలింగ్ కోసం 1,530 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన పెన్నులను మాత్రమే ఉపయోగించాలి.
మైసూర్ పెయింట్స్ కంపెనీకి చెందిన వాయిలెట్ కలర్ స్కెచ్ పెన్నులను వాడేందుకు ఈసీ అనుమతించింది. స్కెచ్ పెన్నులతోపాటు ఓటరు చేతికి వేసే గుర్తు కోసం.. ఇండిలిబుల్ ఇంకును కూడా తెప్పించారు. 3,600 సీసాల ఇండెలిబుల్ ఇంక్తోపాటు 7,200 వాయిలెట్ కలర్ స్కెచ్ పెన్నులను.. పోలింగ్ కోసం మైసూర్ పెయింట్స్ కంపెనీ సరఫరా చేసింది. సిరా, స్కెచ్ పెన్నుల వ్యయం 10 లక్షలా తొమ్మిది వేలా 904 రూపాయలు. ఈ మొత్తాన్ని సదరు కంపెనీకి చెల్లించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి : 25 లక్షలు ఫట్.. ఇంట్లోంచి ఎస్కేప్