పుణె, దిల్లీ రైల్వే స్టేషన్లల్లో పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఐజీ రమేశ్ చంద్ర ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టేషన్‌లోని కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వేలో ప్రయాణికుల భద్రతే ధ్యేయమని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బిన్నయ్య తెలిపారు. రైల్వే స్టేషన్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆర్పీఎఫ్ పోలీసులు కోరారు. ప్రజలు, కూలీలు పోలీసులకు సహకారించాలన్నారు.
అన్ని శాఖల రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలంలోని ప్లాట్ ఫాంపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్‌తో ప్రయాణికుల బ్యాగులను, వస్తువులను తనిఖీ చేశామని బిన్నయ్య తెలిపారు. స్టేషన్లో పనిచేస్తున్న కూలీలకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని సూచించారు.