ఆ రహదారులపై వెళ్లాలంటేనే గుండెల్లో గుబులు.. అడుగడుగునా నీళ్లు చేరిన గుంతల్లో వాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పట్టణ రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. పుర, నగరపాలక సంస్థల్లో సాధారణ నిధులు (జనరల్ ఫండ్) అందుబాటులో ఉన్నచోట కొంత ప్రయత్నం సాగుతోంది. మిగతా ప్రాంతాల్లో పనుల నిర్వహణకు అంచనాలు వేయడానికే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు. గడచిన రెండు నెలల్లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు పట్టణాల్లో రహదారులు, కాలువలు, తాగునీటి పైపులైన్లకు రూ.150-200 కోట్ల నష్టం వాటిల్లినట్లు పురపాలక శాఖ ప్రాథమిక అంచనా.
విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నష్టం ఎక్కువ. గత నెల 9న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలకు అధికారులు పరిస్థితిని వివరించారు. తక్షణ సాయంగా రూ.75 కోట్లు అందేలా చూడాలని కోరారు. ప్రత్యేకించి రహదారుల శాశ్వత మరమ్మతులకు రూ.1,250 కోట్లు అవసరమని స్పష్టం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థల్లో రూ.350 కోట్ల సాధారణ నిధులతో కొన్ని ముఖ్యమైన రహదారులకు ఇటీవల మరమ్మతులు ప్రారంభించారు. గుంటూరు, నెల్లూరు నగరపాలక సంస్థల్లో రూ.45 కోట్లతో ఇంజినీర్లు అంచనాలు వేశారు. టెండర్లు పిలవాల్సి ఉంది. మరో రెండు నగరపాలక సంస్థలు, 22 పురపాలక సంఘాల్లో నిధుల కొరత.. రహదారుల మరమ్మతులకు ప్రతిబంధకంగా మారింది.
ఇదీ చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు