సైబరాబాద్‌లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు 23 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 17 మంది మరణించారు. 30 మంది క్షతగాత్రులయ్యారు. రాచకొండలో ఈ నెల 12 వరకు 35 ప్రమాదాలు చోటుచేసుకోగా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఎందుకిలా జరిగిందంటూ సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆరా తీస్తే పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.
జనవరి, ఫిబ్రవరి కంటే మార్చిలో..
ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో మార్చిలో 481 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. 99 మంది మరణించారు. జనవరి, ఫిబ్రవరితో పోల్చితే కొంత వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. కానీ.. మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉంది. సైబరాబాద్‌లో జనవరి కంటే తక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నా మరణాల సంఖ్య ఫిబ్రవరిలోనే ఎక్కువగా ఉంది. జనవరిలో 63, ఫిబ్రవరిలో 80, మార్చిలో 61 మంది మరణించారు. రాచకొండలోనూ ఫిబ్రవరిలోనే అత్యధికంగా దుర్మరణం పాలయ్యారు. ఈ కమిషనరేట్‌లో జనవరిలో 59, ఫిబ్రవరిలో 70, మార్చిలో 38 మంది మరణించారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో జరిగిన ప్రమాదాల గణాంకాలు ఇలా ఉన్నాయి
నెల | ప్రమాదాలు | మరణాలు | క్షతగాత్రులు |
జనవరి | 637 | 122 | 696 |
ఫిబ్రవరి | 622 | 150 | 646 |
మార్చి | 481 | 99 | 488 |
కారణాలు ఇవే !
- రోడ్లు ఖాళీగా ఉండటంతో వాహనదారులు గాల్లో దూసుకెళ్తున్నారు. వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.
- నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను తెచ్చేందుకు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడమూ ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు.
- ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దూర ప్రాంతాలకు బైక్‌లపై అదీనూ రాత్రిపూట వెళ్తున్నారు. ఆ క్రమంలో అలిసి విశ్రాంతి తీసుకోకుండా అలాగే డ్రైవింగ్ చేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: మృతులు 14.. అందులో 13 మంది మగవారే