రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా.. లేదా అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసు అధికారులు.. వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, లైసెన్సు లేకుండా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్లు వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేస్తూ జరిమానా విధిస్తున్నారు.
మద్యం తాగి వాహనం నడిపిన వారికి న్యాయస్థానం ఒకటి, రెండు రోజులు జైలు శిక్ష విధించేది. ఇప్పుడు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ వ్యక్తి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని 304(2) సెక్షన్ కింద కేసులు నమోదు చేసి గరిష్ఠంగా పదేళ్ల పాటు శిక్ష విధించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలుచేయనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2016, జులై 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య అనే తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన సంఘటనలో పోలీసులు మొదటిసారి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచీ సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సెక్షన్ కిందనే కేసులు నమోదు చేస్తున్నారు.
* రాష్ట్రంలో 2019లో 19,463 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. అందులో 6,309 మంది మరణించారు.
* 2020, డిసెంబరు రెండో వారం వరకు జరిగిన 14,888 ప్రమాదాల్లో 5,157 మంది మృత్యువాత పడ్డారు.
* లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ఈ ఏడాది ప్రమాదాలు తగ్గాయి.
* అయినా.. రాష్ట్రంలో సగటున రోజుకు 50కిపైగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
- ఇదీ చూడండి : చిన్నారి గుండెకు రంధ్రం... ఆపరేషన్‌తో దక్కేను ప్రాణం