పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంజినీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, భూసేకరణ, లైనింగ్, తదితరాల గురించి స్మిత సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగకపోవడంపై ఆరా తీశారు. భూసేకరణ పరిహారానికి సంబంధించిన నిధులు, ఇతర సమస్యలను ఇంజినీర్లు ఆమెకు వివరించారు. పేలుళ్లు చేపట్టాల్సిన పనులను ముందు పూర్తి చేయాలని, లైనింగ్ పనులను ఇంకా వేగవంతం చేయాలని చెప్పారు. ఆశించిన స్థాయిలో పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. పనుల్లో వేగం పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటు నీటిపారుదల శాఖ ఆస్తులు, సిబ్బంది, వివరాలపై కూడా ఇంజినీర్లతో రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.