ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డారు. 16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నంకాని, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధికాని కనిపించలేదని స్పష్టం చేశారు.
రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదని అన్నారు. ఇప్పటికే హద్దుదాటి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని సమాజం భరించిందని... ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన సమయం వచ్చిందన్నారు.