Revanth Reddy on Ibrahimpatnam Incident: : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్ ఆసుపత్రి)లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోవడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును బాధ్యుడిని చేస్తూ వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు.
నాలుగు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారిని తూతూ మంత్రంగా సస్పెండ్ చేసి.. ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి బాధితుల తరఫున పోరాటం చేస్తుందన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హరీశ్‌రావు సమర్థుడని వైద్యశాఖ కట్టబెడితే.. ‘నిరుపేద కుటుంబాలకు చెందిన 34 మందికి ఒక గంటలో ఏవిధంగా ఆపరేషన్ చేశారు?హరీశ్‌రావు సమర్థుడని వైద్యశాఖ కట్టబెడితే.. ఆయన హయాంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులు పని చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందితే .. వీరిని ఎందుకని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకొచ్చారు? ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతోంది. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలి.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: