Revanth Reddy on Farmers Suicide : రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్థయాత్రల్లో బిజీగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ లేక.. పంటను కొనుగోలు చేసే నాథుడు లేక కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చివరకు పంట అమ్మితే.. ఆ డబ్బు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఎదురైందని వాపోయారు. రైతుల ఇళ్ల ముందు అప్పుల వాళ్లు లొల్లి చేస్తుంటే.. ఆత్మగౌరవం కలిగిన అన్నదాత ఆత్మహత్యే శరణమని ఉరికొయ్యకు వేలాడుతున్నాడని.. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంటున్నాడని అన్నారు.
Revanth Reddy Tweet Today : రైతుల సమస్యను పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ తీర్థయాత్రల పేరిట రాష్ట్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బై..బై..కేసీఆర్..(#BYEBYEKCR) ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
Revanth Reddy Today Tweet : రాష్ట్రంలో పదిరోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిరప సాగు చేసి నష్టాల పాలయ్యాయనని.. అప్పుల వాళ్లు ఇంటికొచ్చి పరువు తీస్తున్నారని ఆత్మగౌరవం కలిగిన ఓ అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. తాను వేసిన మిరపపంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
Telangana Farmers Suicide : ఉద్యోగం రాక.. తండ్రికి వ్యవసాయంలో సాయపడదామని సాగు మొదలుపెట్టి అకాల వర్షాలతో పంట నష్టపోయి అప్పులపాలైన ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఓవైపు మొలకెత్తుతోన్న ధాన్యం.. మరోవైపు కొనుగోలులో అలసత్వం.. ఇంకోవైపు పెరుగుతున్న అప్పులు.. ఇలా వెంటాడుతున్న బాధలతో తీవ్ర మనస్థాపానికి గురైన మరో రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరినాగారంలో జరిగింది.