తెరాస ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తోందని ప్రశంసించారు. ప్రధానంగా వ్యవసాయం రంగంలో చేపట్టిన సంస్కరణలు ఫలితమిస్తున్నాయని కొనియాడారు.
అది దురదృష్టకరం
అంబేడ్కర్ ఆశయాలను ఇంకా సాధించలేకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వారసత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేయగా... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దేశ హితం కోసం ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలు తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నిరసన తెలిపే హక్కు లేదు
పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 130 కోట్ల మందికి పవిత్ర గ్రంథమైన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉత్తమ్.. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు.
సమసమాజ స్థానప కోసమే తెదేపా
చట్టాలు కొందరికి చుట్టాలుగా మారాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. సమసమాజ స్థానప కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని గుర్తుచేశారు. వినూత్న రీతిలో సంస్కరణలు చేపట్టిన మహానేత రూ.2కే కిలో బియ్యం ఇచ్చి ఆహారభద్రతను అమలు చేశారని కొనియాడారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురోగమించిందని రమణ కితాబిచ్చారు.
అది మంచి పరిణామం
తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలందరూ రాజ్యాంగాన్ని ఆచరించి, పరిరక్షణకు కంకణబద్ధులు కావడం మంచి పరిణామమని కోదండరాం ప్రశంసించారు. వామపక్షాలతో పాటు ఇతర ప్రధాన పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మహనీయుల త్యాగాలను స్మరించుకున్న నేతలు దేశాభివృద్ధికి, అసమానతలు తొలగించేందుకు పాటుపడతామని హామీనిచ్చారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్‌లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్