ఎల్బీనగర్‌లోని ఓ కళాశాల కామర్స్ కోర్సులతో నడుస్తోంది. దీనికి నగరంలో మూడు చోట్ల శాఖలున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని శాఖల్లో సీట్లు నిండాయి. ఒక్కచోట మాత్రమే సీట్లు మిగిలి ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాలు పంపించి ప్రవేశాలు కల్పిస్తున్న పరిస్థితి.
కూకట్‌పల్లిలోని మరో కళాశాలది ఇదేతీరు. ప్రభుత్వం నుంచి విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ ప్రవేశాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ కళాశాలపై షిఫ్టింగ్ నిబంధన విషయంలో ఉస్మానియా వర్సిటీ అధికారులకు ఫిర్యాదులు అందగా, అపరాధ రుసుం విధించగా కేసు నడుస్తోంది.
బేగంపేటలోని కళాశాల సైతం ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది. తనకు ఉన్న పేరును అడ్డం పెట్టుకొని ఆన్‌లైన్‌లో ప్రవేశాలు తీసుకుంటోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురై సీట్లు ఉండవన్న బెంగతో ప్రవేశాలు తీసుకుంటున్నారు. నిబంధనలు విరుద్ధంగా ప్రవేశాలు తీసుకుంటున్నా, ఓయూ అధికారులు పట్టించుకున్న పరిస్థితి కనిపించడంలేదు.
రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ కార్యక్రమంలో ఏటా సీట్ల భర్తీ జరుగుతోంది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 370 కళాశాలలు దోస్త్ పరిధిలో ఉండగా.. మరో 61 కళాశాలలు సొంతగా సీట్లు నింపుకొంటున్నాయి. ఏటా దోస్త్ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ఆయా కళాశాలల్లోనూ ప్రవేశాలు జరగాల్సి ఉంది. ఈసారి కరోనా కారణంగా దోస్త్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని దోస్త్‌లో లేని కళాశాలలు విద్యాసంవత్సరం క్యాలెండర్ అనుసరించకుండా సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. దోస్త్‌లో ఉన్న కళాశాలలకు ప్రవేశాల విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూజీసీ ఇటీవల కేవలం చివరి సంవత్సరం పరీక్షలు పెట్టాలని, తర్వాత అకడమిక్ క్యాలెండర్ తర్వాత ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆయా డిగ్రీ కళాశాలలు తమ సొంత క్యాలెండర్‌ను అమలు చేస్తున్నాయి.
ఓయూ పరిధిలో డిగ్రీ ఫీజు చాలా కోర్సులకు రూ.8-14 వేలు వరకు ఉంది. దోస్త్‌లో లేని కళాశాలలు మాత్రం ఉస్మానియా నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నాయి. ఒక్కొక్క కోర్సుకు వార్షిక ఫీజు కింద రూ.50-60 వేలు వసూలు చేస్తున్నాయి. ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులను సైతం వెంటనే చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
ఫిర్యాదు వస్తే చర్యలు..
యూనివర్సిటీ నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఫీజులు తీసుకోవడానికి లేదు. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు తీసుకోవాల్సిన బాధ్యత కళాశాలలపై ఉంది
- ప్రొ.సీహెచ్.గోపాల్‌రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్
గుర్తింపు రద్దు చేయాలి
దోస్త్‌లోని కళాశాలలు ఆ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలి. కొందరు అధికారులతో కుమ్మక్కై సీట్లు భర్తీ చేసుకుంటూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేసే కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రేమ్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్