ఈ ఏడాది మే మాసంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించింది. జోన్ పార్సిల్‌లో ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరం మే నెలలో 44,374 టన్నుల లోడ్‌ను సరఫరా చేయడం ద్వారా రైల్వే శాఖ రూ.19.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
దేశం మొత్తం మీద కొవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సమయంలో ఈ ఘనత సాధించడం విశేషం. నిత్యావసర వస్తువుల సరఫరాపై కరోనా ప్రభావం పడకుండా సజావుగా సాగేలా రైల్వేశాఖ అనేక చర్యలు తీసుకుంది. తద్వారా పార్శిల్లో జోన్ మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం రూ. 19.14 కోట్లు సాధించింది. ఇది జనవరి 2021 నెలలో సాధించిన పార్సిల్ ఆదాయం కంటే దాదాపు రూ.3 కోట్లు అధికమని అధికారులు వెల్లడించారు. జోన్ మే 6 న ఒక్క రోజే పార్సిల్‌లో రూ.1.099 కోట్ల రికార్డు ఆదాయాన్ని పొందిందనట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు పండ్లు, ఔషధాలు, వరి, కోడి గుడ్లు, నిమ్మకాయలు, నెయ్యి వంటి అనేక నిత్యవసర వస్తువుల రవాణాను రైళ్ల ద్వారా సరఫరా చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. వీటితో పాటు దేశ రాజధానికి దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా 62 లక్షల లీటర్ల పాలను కూడా సరఫరా చేశాయి. దక్షిణ మధ్య రైల్వే 69 కిసాన్ ప్రత్యేక రైళ్లను నడిపి నాగర్‌సోల్, నూజివీడు, లింగంపేట జగిత్యాల నుంచి 24,748 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసింది.
ఇదీ చూడండి: child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!