Read program in Schools : పాఠశాల పిల్లల్లో చదవడాన్ని అలవాటుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పఠన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాన్ని రాష్ట్రంలో చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు (రీడ్: రీడ్-ఎంజాయ్-డెవలప్) అనే పేరిట శనివారం నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ముగిసేవరకు ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. అప్పటికి విద్యార్థులందరూ వారి స్థాయికి తగిన అంశాలను ధారాళంగా చదవగలగాలి. చదవడం ఒక అలవాటుగా మారాలి. విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి. ఈ మేరకు కార్యక్రమం అమలు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన జారీ చేశారు. ఈ కార్యక్రమం నోడల్ అధికారి సువర్ణ వినాయక్, సమగ్ర శిక్షా అభియాన్ ఏఎస్‌పీడీ రమేష్, అకడమిక్ మానిటరింగ్ అధికారి తాజ్‌బాబు తదితరులు జిల్లా బృందాలకు శనివారం అవగాహన కల్పించారు.
ముఖ్యమైన మార్గదర్శకాలు..
Read program in Telangana Schools : పాఠ్య పుస్తకాల్లోని పాఠాలతో పాటు పాఠ్యేతర పుస్తకాలు, కథలు, వార్తా పత్రికలు వంటివి తప్పులు లేకుండా వేగంగా చదవాలన్నది కార్యక్రమం లక్ష్యం. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ దీన్ని నిర్వహిస్తారు. ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహిస్తారు. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు ప్రతిరోజూ తప్పనిసరిగా తాము బోధించే పాఠ్యాంశాన్ని 10 నిమిషాలపాటు చదివించాలి. అందులో కీలక పదాలను గుర్తించేలా చేసి బ్లాక్‌బోర్డుపై లేదా చార్టుల మీద రాయాలి. తద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారుతుంది. గ్రంథాలయ పుస్తకాలను పిల్లలతో చదివించేందుకు ప్రతిరోజూ ఒక కాలాంశాన్ని కేటాయించాలి. ఇంటి వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలతో కథల పుస్తకాలు, వార్తా పత్రికలు చదివించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. అన్ని పాఠశాలల్లో ఈనెల 14వ తేదీ 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను జరపాలి. ఈనెల 21వ తేదీన అన్ని పాఠశాలల్లో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించి ప్రముఖులను, తల్లిదండ్రులను ఆహ్వానించాలి. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాలి.