రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2015 డిసెంబరు ఆరో తేదీన తొలిసారి ఈ పదవిలో నియమితులైన ఆయన మూడేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు కారణంగా సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అవి పరిష్కారం కావడంతో తాజాగా సీఎం కేసీఆర్ ఆయనను మరోసారి నియమించాలని నిర్ణయించారు.
ఉత్తర్వులు వెలువడిన వెంటనే రసమయి మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు. కేసీఆర్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ, స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కళాకారుల పాత్ర గొప్పదన్నారు. దేశానికే ఆదర్శంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు మరింతగా చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రెండోసారి నియామకమైన రసమయి కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
టెస్కాబ్ ఛైర్మన్‌కు కేటీఆర్ అభినందనలు..
వ్యవసాయ రంగానికి రుణాలు వేగంగా అందిస్తూ నాబార్డు జాతీయ అవార్డును దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. రుణాలు వేగంగా ఇస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్రస్థాయిలో టెస్కాబ్, జిల్లా జిల్లా కేటగిరీలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకులు అవార్డు దక్కించుకున్నాయి. ఈ రెండు బ్యాంకులకు రవీంద్రరావే సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ టెస్కాబ్ ఛైర్మన్ రవీంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధం