మూడు కాళ్లతో పుట్టిన నెల రోజుల చిన్నారికి... ఏపీలోని గుంటూరు సర్వజన ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూరో సర్జరీ విభాగం వైద్యులు.. శ్రమ ఓర్చి మూడో కాలును తొలగించారు. అక్కడ పురుష జననాంగాలు ఉండటం, మూడో కాలుకు సంబంధించిన నరాలు నడుం మధ్యలో అతుక్కొని ఉన్నాయి. వాటిని కూడా న్యూరో సర్జరీ వైద్యలు వేరు చేసి.. అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి పాపకు ప్రాణాలు పోశారు.
వైద్య భాషలో అలా అంటారు..
వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు 21 నమోదయ్యాయని.. ఇది 22వ కేసు అని వైద్యులు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను వైద్య భాషలో 'లంబర్ మైలో మీనింగ్ సీల్ విత్ ట్రెపీడస్ డిపార్మటి'గా పిలుస్తారని న్యూరో సర్జరీ వైద్యులు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రాణ దాతలకు కృతజ్ఞతలు..
కేసును అంతర్జాతీయ వైద్య సదస్సులో ప్రచురిస్తామని వివరించారు. తమ బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.