ఏపీలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యంత అరుదైన హఫ్లో ఐడెంటికల్ మూలకణ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. సీఎం సహాయ నిధితో తమ వైద్య బృందం విజయవంతంగా చేయడం గర్వకారణమని మణిపాల్ వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధిగ్రస్థుడు కోయా ఈశ్వర్ సాయి గణేశ్‌ను 100 రోజులు వైద్యశాలలో ఉంచి పరిశీలించామన్నారు.
క్యాన్సర్ వైద్య, మూలకణ మర్పిడి నిపుణులు డాక్టర్ మాధవ్ దంతాల, కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి బృందం నేతృత్వంలో నిర్వహించిన శస్త్రచికిత్సకు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారు. 20 ఏళ్ల కోయా ఈశ్వర్ సాయి గణేష్ అనే బీకాం విద్యార్థికి దాత నుంచి పూర్తిగా సరిపోలిన హెచ్‌ఎల్‌ఏకు బదులు సగం సరిపోలిన హ్యూమన్ ల్యుకోసైట్ యాంటీజెన్ (హెచ్‌ఎల్‌ఏ)ను తల్లిదండ్రులు లేదా తోడబుట్టిన వారి నుంచి సేకరిస్తారని చెప్పారు.
రాష్ట్రంలోనే ఈ తరహా మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా మణిపాల్ నిలిచిందన్నారు. రోగికి 2016లో టీ-లింపోబ్లాస్టిక్ లింఫోమాను గుర్తించారని, ఇందుకోసం రెండున్నరేళ్లు చికిత్స తీసుకున్నారని వెల్లడించారు. 2019లో చికిత్స ముగిసిన ఆరు నెలల్లోనే మళ్లీ వ్యాధి బయటపడింద... 2021 జనవరిలో విద్యార్థికి వ్యాధి నియంత్రణకు కీమోథెరఫీ చికిత్స అందించారని తెలిపారు. వ్యాధి నియంత్రణలో వచ్చిన తర్వాత హఫ్లో ఐడెంటికల్ (సగం సరిపోలిన) మూలకణ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు. చికిత్స కోసం విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు నుంచి స్టెమ్ సెల్ తీసుకున్నామన్నారు. ఈనెల మెదటి వారంలో ఈశ్వర్‌ను వైద్యశాల నుంచి డిశ్ఛార్జి చేసినట్లు చెప్పారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ కింద రోగిని కనీసం ఏడాది వరకు వైద్యులు స్థిరంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన వివరించారు.