KOLLERU BIRDS DEATH: ఏపీలోని కొల్లేరు ప్రాంతంలో సుమారు 189 రకాల పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో వీదేశీ జాతులు 90 రకాలున్నాయి. తూర్పు ఐరోపా, ఉత్తర ఆసియా ప్రాంతాల నుంచి సంతానోత్పత్తి కోసం ఏటా రెండు నుంచి మూడు లక్షల పక్షులు కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. వాటికి ఆవాసంగా ఉండే మాధవవరం, ఆటపాక కేంద్రానికి చెందిన 267 ఎకరాల చెరువులో నీరు పూర్తిగా అడుగంటింది. దీంతో పక్షుల మనుగడ కష్టతరంగా మారింది.
సరస్సులో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుతున్నారని స్థానికులు అంటున్నారు. పరిశ్రమల నుంచి సరస్సులోకి విడిచే వ్యర్థాల వల్ల చేపలు, పక్షులు చనిపోతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరస్సుల్లోని నీరు వేడెక్కి చేపలు మృత్యువాత పడుతున్నాయి. పక్షులకు తిండి దొరక్క ఆకలితో అల్లాడి చనిపోతున్నాయి. పక్షుల కేంద్రం అభివృద్ధికి ఏటా రూ.25లక్షలు మంజూరవుతున్నప్పటికీ.. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు.
కేంద్రంలో గట్లు పాడైపోయి.. స్టాండ్లు విరిగినా వాటికి మరమ్మతులు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. పక్షులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్లే పక్షులు మృత్యువాత పడుతున్నాయని అధికారులు అంటున్నారు. నీరు, ఆహారం లేకపోవటం వల్ల మరణించే వాటి సంఖ్య తక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు పక్షుల కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. సరస్సు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"కొల్లేరులో పక్షులు చనిపోతున్న పరిస్థితి ఇవాళ కనపడుతుంది. పరిశ్రమల నుంచి సరస్సులోకి విడిచే వ్యర్థాల వల్ల చేపలు, పక్షులు చనిపోతున్నాయి. అనేక రకాల పక్షులు విదేశాల నుంచి వస్తాయి. ప్రభుత్వం ఇకనైనా సంరక్షణ చర్యలు తీసుకోవాలి." -స్థానికులు
ఇదీ చదవండి: పిల్లలపై కొవాగ్జిన్ ఉత్తమ సమర్థవంతంగా పనిచేస్తోంది: లాన్సెట్ జర్నల్
దివ్యాంగుల కోసం మ్యూజియం.. ఆ వస్తువులతో ఏ పనైనా సులువుగా పూర్తి!