ఆకాశంలో నెలవంక కన్పించడం వల్ల భాగ్యనగరం చాంద్ ముబారక్ అనే పలకరింపులతో సందడిగా మారింది. ఆకాశంలో నెలవంక కన్పించిన సూచకంగా మసీదుల నుంచి సైరన్ మోత విన్పించడంతో ముస్లింలు వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సోమవారం ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించుకోవాలని రుహియాత్ హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా ముఫ్తి అజీముద్దీన్, ఉపాధ్యక్షుడు మౌలానా కుబుల్‌పాషా సుల్తారీలు సూచించారని మక్కామసీదు సూపరింటెండెంట్ ఎం.ఎ.ఖరీద్‌సిద్ధికి చెప్పారు. కరోనా నేపథ్యంలో వేడుకలను ఇళ్లలోనే శుక్రానా నమాజ్‌గా నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు.
సోమవారమే ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను నిర్వహించుకోవాలని దక్షిణ భారత షియా రుహియాత్ హిలాల్ కమిటీ కన్వీనర్, రాష్ట్ర భాజపా మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్‌అలీబాక్రీ పేర్కొన్నారు. రంజాన్ నెల చివరిరోజుల్లో లాక్‌డౌన్‌లో కొంత సడలింపు ఉండటంతో చార్మినార్, లాడ్‌బజార్, గుల్జార్‌హౌజ్, మదీనా పరిసర ప్రాంతాల్లో ఎండను సైతం లెక్కచేయకుండా పలువురు పగటిపూట కొనుగోళ్లు చేశారు.