ఏపీ ప్రభుత్వం చేసిన ఫీజిబిలిటీ అధ్యయనం ప్రకారం... విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ వల్ల జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుందని.. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2015లో రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఉన్న జీడీపీ.. 2018 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలెప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ 2019 ఆగష్టు 30న ఆమోదించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సభకు తెలిపారు. ఈ కారిడార్ తొలిదశలో శ్రీకాళహస్తి నోడ్‌ను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయడానికి ఆమోదముద్ర వేసినట్లు మంత్రి వెల్లడించారు.
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతం శ్రీకాళహస్తి, విశాఖపట్నం, కడప నోడ్స్‌ని, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్ నోడ్‌ను అభివృద్ధి చేయాలని గుర్తించినట్లు మంత్రి పార్లమెంట్‌కు తెలియజేశారు. శ్రీకాళహస్తి, కడప నోడ్స్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్, ప్రాథమిక స్థాయి ఇంజినీరింగ్ పనుల కోసం కన్సల్టెంట్ నియామకం జరిగినట్లు వివరించారు. విశాఖ నోడ్‌కు సంబంధించి... మాస్టర్ ప్లానింగ్, ప్రిలిమినరీ ఇంజినీరింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పారు.
శ్రీకాళహస్తి, విశాఖ నోడ్స్ మొదలైతే.. 1.80 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. మాస్టర్ ప్లానింగ్, ప్రిలిమినరీ ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి ముందుకు తీసుకెళ్లనున్నట్లు రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ కారిడార్‌లో 2వేల 139.44 కోట్ల రూపాయలతో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయడానికి గత డిసెంబర్ 30న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఆమోదించిందని, ఇక్కడ భారీ మౌలిక వసతుల కల్పన జరుగుతుందని గోయల్ తెలిపారు.
ఈ ప్రాజక్టు నిర్మాణం కోసం జాతీయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కృష్ణపట్నం పారిశ్రామిక నగర అభివృద్ధి లిమిటెడ్ పేరుతో ప్రత్యేక ప్రయోజక వాహనం-ఎస్‌పీవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. సుమారు 98 వేల మందికి అవకాశాలు లభిస్తాయన్నారు.. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద నోడ్‌ను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఆగస్టు 19న జాతీయ పారిశ్రామిక అభివృద్ధి, అమలు ట్రస్ట్ నిర్ణయించిందని.. ఇందుకు సంబంధించిన ప్రీప్రాజెక్టు అభివృద్ధి పనులు మొదలయ్యాయని పియూష్ గోయల్ తెలిపారు.
ఇదీ చదవండీ: హెల్త్ కేర్ వర్కర్లకు ముగిసిన తొలిదశ వ్యాక్సినేషన్