ఏ పంటలు వేయాలో రైతులకు చెప్పి వారి కమతాల విస్తీర్ణాన్ని నమోదు చేశారు. పత్తి పంట 70 లక్షల వరకూ వేయాలని తొలుత అనుకున్నా తాజా వివరాలతో అది 60.16 లక్షల ఎకరాలకు చేరింది. రాష్ట్రంలో మొత్తం 41.76 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని తేలింది. పత్తి 60.16 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్కలేయగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాటానే 10.67 లక్షల ఎకరాలు. కంది పంట కూడా విరివిగా సాగుచేయాలని ప్రభుత్వం చెప్పగా వికారాబాద్, నారాయణపేట జిల్లాల రైతులు మాత్రమే ఈ పంటను లక్ష ఎకరాలకు మించి వేయడానికి ముందుకొచ్చారు. వర్షాధార భూములు ఇక్కడ అధికంగా ఉండటం, కంది దిగుబడి ఈ ప్రాంతాల్లో ఎక్కువ రావడానికి అవకాశాలుండటమే ఇందుకు ప్రధాన కారణమని వ్యవసాయాధికారులు చెప్పారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తామని రైతులు తెలిపారు. అందులో కనీసం ఒక్కశాతం విస్తీర్ణంలోనైనా వరి వేయడానికి ముందుకు రాలేదు. అక్కడ పత్తి దిగుబడి ఎక్కువగా వస్తుందని దానికే రైతులు మొగ్గుచూపుతున్నారు.
సోయా 4.68 లక్షల ఎకరాల్లో వేయాలనుకున్నా..
సోయాచిక్కుడు 4.68 లక్షల ఎకరాల్లో వేయాలని లక్ష్యాన్ని నిర్ణయించినా ఈ పంట విత్తనాలు నాణ్యమైనవి 3 లక్షల ఎకరాలకు మించి రాయితీపై అమ్మడానికి అందుబాటులో లేవని వ్యవసాయశాఖ తెలిపింది. సోయాకు బదులు కంది లేదా ఇతర పప్పుధాన్యాల పంటలను సాగుచేయాలని రైతులను చైతన్యపరుస్తామని ఈ శాఖ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే...
అత్యధికంగా నిజామాబాద్ (ఇందూరు)లో వరి, నల్గొండ (నీలగిరి)లో పత్తి సాగవుతుందని తేలింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లా వరి, పత్తి సాగుకు కీలకమని ఏఈవోల అధ్యయనంలో స్పష్టమైంది.