పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రధానంగా గన్నవరం - ఆగిరిపల్లి ప్రధాన రహదారి గొల్లనపల్లి రోడ్డు అస్తవ్యస్థంగా తయారైంది. కేసరపల్లి బీసీ కాలనీలో ఇళ్ల మధ్య భారీగా నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీ గూడెం, ముస్తాబాద్, గన్నవరం, రాయ్ నగర్, పెద్ద అవుటపల్లి, తేలప్రోలు, బుద్ధవరంలోని పలు కాలనీల్లో భారీగా నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో...
ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో.. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వరి నారుమళ్లు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే నారుమళ్లు మునిగిపోయి కుళ్లి పోతాయని రైతులు వాపోతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో..
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు, పంట పొలాలు జలమయమయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేసుకున్న రైతులకు ఈ వర్షం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం చేస్తున్నారు. రాయలసీమలోనూ అక్కడకక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
మరో రెండు రోజులు... భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.... విపత్తు నిర్వహణశాఖ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: