హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో పలుచోట్ల కురిసిన వర్షాలకు నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు వాహనదారులు, బాటసారులు చెట్ల కింద తలదాచుకున్నారు.
హైదరాబాద్‌లోని బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, అంబర్‌పేట, మలక్‌పేట, ఎల్బీనగర్, సైదాబాద్, వనస్థలిపురం, రామంతాపూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసింది.
గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వరకు రహదారిపై వర్షపునీరు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని రాకపోకలను చక్కదిద్దే పనులు చేపట్టారు. సుమారు అరగంటపాటు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు కదలక మొరాయించడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని నెడుతూ వాహనదారులకు సహాయపడ్డారు.
పలు ప్రాంతాల్లోఈ రోజు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి.
ఇవీ చూడండి: WEATHER REPORT: అప్పటి దాకా భగభగలు.. అంతలోనే వానలు