స్నేహల్‌భాయ్‌ది సూరత్. చిన్నప్పటినుంచీ ప్రకృతి ప్రేమికుడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అతడు కాస్త కష్టమైనా సరే తన సొంతిల్లు పచ్చదనానికి అద్దం పట్టేలా ఉండాలనుకున్నాడు. అతడి ఆలోచనలకు ఫాల్గుణీదేశాయ్ అనే ఆర్కిటెక్ట్ ప్రయత్నమూ తోడవ్వడంతో స్నేహల్ కలగన్న పొదరిల్లు ఎట్టకేలకు తయారైంది. అతడి ఇంటి గేటు తెరవగానే... పచ్చని చెట్లు ఆహ్వానం పలుకుతాయి. వాటిపైన సీతాకోకచిలుకలూ, పక్షులూ వాలుతూ... ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వాటిల్లో ఆ ఇంటికి అవసరమైన కూరగాయల మొక్కలూ, పండ్ల చెట్లే కాదు... ఔషధగుణాలున్నవీ, పక్షులకు ఆహారాన్నందించే మొక్కలూ ఉంటాయి. అన్నీ కలిపి 600 రకాల వరకూ ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్తే స్నేహల్ ఇల్లు కనిపిస్తుంది.
ఈ భవంతిలోకి అడుగుపెడితే... చుట్టూ పెద్దపెద్ద కిటికీలతో, విశాలమైన గదులతో వర్ణరంజితమైన గోడలతో... రంగుల ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎండా, వెలుతురూ, గాలీ ఇంట్లోకి నేరుగా వచ్చేందుకే ఆ ఏర్పాటని చెబుతాడు స్నేహల్. ఇల్లు కట్టేటప్పుడే కరెంటు అవసరం ఉండకూడదనుకున్నాడట. అందుకే ఇంటిపైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాడు. వాటినుంచి వచ్చే విద్యుత్తును సైతం మితంగా వాడేందుకు ఇల్లంతా ఎల్‌ఈడీ లైట్లనే అమర్చాడు. ఎండాకాలం, చలికాలంలో సోలార్‌ప్యానల్స్ పనిచేస్తాయి. వర్షాకాలంలో విద్యత్తు కోసం ఇంటిపైన విండ్‌మిల్‌ని ఏర్పాటుచేశాడు. నిజానికి రెండుమూడు గదులకు అసలు ఆ లైట్ల అవసరం కూడా ఉండదు. వీటన్నింటితో వేసవిలోనూ ఇల్లంతా చల్లగా ఉంటుంది. బయట 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా... ఈ ఇంట్లో మాత్రం 35 డిగ్రీల ఉష్ణోగత దాటదట. ఏసీ అవసరం అసలే ఉండదట.
లక్షల లీటర్లలో వర్షపునీరు నిల్వ...
ఏ ఇంట్లోనైనా వ్యక్తిగత అవసరాలకు బోరునీళ్లూ, తాగేందుకు మంచినీళ్లూ ఉంటాయి. స్నేహల్ కుటుంబసభ్యులు మాత్రం అన్ని పనులకూ వర్షపునీరే వాడతారు. ఆ నీటిని వీలైనంత ఎక్కువగా ఒడిసిపట్టేందుకే ఇంటిపైకప్పును ఏటవాలుగా కట్టించుకున్నాడు. డాబామీద పడిన వర్షపునీరు నేరుగా ట్యాంకుల్లోకి వెళ్లేలా ప్రత్యేక పైపులూ, ట్యాంకుల్నీ పెట్టించుకున్నాడు. రెండు అంతస్తుల్లోనూ వర్షపునీరు నిల్వ చేసేందుకు ట్యాంకులు ఉంటాయి. ఒకదాంట్లో రెండులక్షల లీటర్ల నీరూ, మిగిలిన వాటిల్లో పదివేల లీటర్ల చొప్పున నీటిని నిల్వ చేసుకోవచ్చు. అవి నిండగా మిగిలిన నీటిని నిల్వ చేసేందుకు చిన్న కొలనూ కట్టించుకున్నాడు. వాషింగ్ మెషీన్‌లో లేదా సింకులో వాడిన నీరు వృథా కాకుండా ప్రత్యేక పైపు ద్వారా టాయిలెట్ ఫ్లష్‌ట్యాంకులోకి చేరేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. వంటకూ, తాగేందుకూ వర్షపునీటిని శుద్ధిచేసేలా రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిని ఎంచుకున్నాడు.
పక్కా ప్రణాళికతోనే...
‘సూరత్‌లోని వివిధ ప్రాంతాల్ని గమనించాకే నేను కట్టుకోబోయే ఇల్లు నందనవనంలా ఉండాలనుకున్నా. అందుకే ఊరి మధ్యలో కాకుండా... పొలిమేరలోని అభావాలో స్థలం తీసుకున్నా. మూడువేల గజాల్లో కట్టిన ఈ ఇల్లు పూర్తవడానికి రెండేళ్లు పట్టింది. మేం నిల్వ చేసుకునే వర్షపునీరు అయిదుగురు సభ్యులున్న మా కుటుంబానికి చక్కగా సరిపోతున్నాయి..’ అని చెప్పే స్నేహల్ తన ఇంటికి ‘ఎకోఫామ్’ అని పేరు పెట్టుకున్నాడు.