రుచిలో మేటిగా భావించే పులసంటే (pulasa) గోదావరి జిల్లాల వాసులకే కాదు.. ఇతర ప్రాంతాల వారూ ఇష్టపడతారు. రుచి మాటెలా ఉన్నా.. ఏపీ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రస్తుతం పులస చేపల ధరలు మరింత ప్రియంగా మారాయి. అంతర్వేది వశిష్టా గోదావరిలో శనివారం 2కిలోలకు పైగా బరువున్న పులస చేప మత్స్యకారులకు చిక్కింది. దీనికి స్థానిక మార్కెట్లో వేలం పాట పెట్టగా.. స్థానిక వ్యాపారులతో పాటు పులస ప్రియులు పోటీ పడి పాటలో పాల్గొన్నారు. చివరికి నర్సాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ. 18వేలకు పులసను సొంతం చేసుకున్నారు. రెండు కిలోలకుపైగా బరువున్న పులస ధర చూసి మత్స్యకారులే ఆశ్చర్యపోయారు.
ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల వల్ల వరద నీరు సముద్రంలోకి వెళ్లడం మొదలైతే.. బురదమట్టితో కూడిన తీపి నీటి రుచికి పులస చేపలు సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తాయి. గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి నదుల్లో ప్రయాణిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గుండా వరద నీటికి ఎదురీదుతూ భద్రాచలం వరకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో మత్స్యకారుల వలలకు చిక్కుతాయి.