Godavari pulasa: వరదల సమయంలో వచ్చే పులస చేపలు తినాలని ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే ఈ చేపల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వరదల్లో పులస చేపలు రావటంతో..అక్కడి మత్స్యకారులు వేటలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు ఆగి మరీ వీటిని కొనుక్కుంటున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ చేపలు దొరకటంతో గిరాకీ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని స్థానికులే కాక ఇతర ప్రాంతాలవారు గోదావరి జిల్లాలకు వచ్చి మరీ వీటిని తీసుకెళ్తుంటారు.
గోదావరి వరద ఉధృతి తగ్గడంతో ఏపీలోని యానాం మార్కెట్లో పులస చేపల విక్రయాలు మొదలయ్యాయి. మంగళవారం ఇక్కడి రేవులో చేపల వేలంపాట నిర్వహించగా 2 కిలోల బరువున్న తాజా పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దక్కించుకుంది. ఈ చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటల వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: