రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ కనెక్షన్లు ఎస్పీడీసీఎల్ పరిధిలో... 95.13 లక్షల వినియోగదారులు ఉన్నారు. ఇందులో 70లక్షల పైచిలుకు గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీటిలో 86శాతం మంది 200ల యూనిట్స్ కన్నా తక్కువ విద్యుత్ వినియోగించేవారు. ఏప్రిల్, మేలో లాక్డౌన్ నిబంధనల అమలులో ఉన్నాయి. జూన్‌లో సడలింపులు ఇవ్వడం వల్ల కార్మికులు మీటర్ రీడింగ్ కార్మికులు బిల్లులు తీస్తున్నారు. ఒక్కసారే మూడు నెలల బిల్లులు తీసి, ఒక్కో నెలకు వేర్వేరు బిల్లులు ఇస్తున్నారు.
సాంకేతికత లేదు..
గడిచిన మూడు నెలల్లో సరాసరిగా కేవలం 60శాతం వినియోగదారులు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించగా... మిగిలిన 40శాతం మంది కట్టలేదు. మూడు నెలల యూనిట్లను మూడుతో భాగించి... మూడు భాగాలుగా చేసి బిల్లులు ఇస్తున్నామని విద్యుద్ శాఖ పేర్కొంటుంది. కరోనా కాలంలో ఇంతకన్నా... మంచి ఆప్షన్ తమ దగ్గర లేదని అధికారులు అంటున్నారు. మూడు నెలల తర్వాత ఒక్కో నెల యూనిట్లను లెక్కించి బిల్లులు ఇచ్చే సాంకేతిక లేదని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.
వాయిదాలు ఉన్నాయ్..
లాక్‌డౌన్‌తోపాటు వేసవి కాలం కావడం వల్ల... 13శాతం అధికంగా వినియోగించారని విద్యుత్‌శాఖ అభిప్రాయపడుతుంది. దీనివల్ల లబ్ధి పొందిన వారే అధికంగా ఉన్నారంటోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వసూలు కావాల్సిన బిల్లులు రూ.5,218.74 కోట్లు కాగా... రూ.4,062.16 కోట్లు వచ్చినట్టు తెలిపింది. విద్యుత్ బిల్లులు కట్టలేని వారికి వాయిదాల రూపంలో చెల్లించేలా అవకాశం ఇస్తామని... ఐతే వాయిదాలపై 1.5శాతం వడ్డీ వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. గత మూడు నెలల్లో అందాద బిల్లులు అధికంగా ఉండి... ఇప్పుడు తక్కువ బిల్లులు వచ్చిన వారికి సర్దుబాటు చేస్తామన్నారు. వాయిదాల్లో కట్టొచ్చు
అసలే ఆర్థికంగా చితికిపోయాం..
ఒకేసారి మూడు నెలల బిల్లులు తీయడం వల్ల స్లాబులు మారుతున్నాయని... వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఐదారు వందల బిల్లులు వచ్చిన వారికి ఇప్పుడు ఏకంగా రూ. 1500ల వరకు బిల్లులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అసలే కరోనా సమయం ఇలాంటప్పుడు ఏసీలు, కూలర్లు ఎలా వాడుతామని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఫ్యాన్లు వాడిన వారికి కూడా వేలల్లో బిల్లులు వచ్చాయని గుండెలు బాదుకుంటున్నారు. కరెంట్ మరికొంత మంది ఒక నెలలో ఎక్కువ బిల్లు... మరో నెలలో తక్కువ బిల్లులు వస్తే... అన్నింటిని ఒకే గాటిన కట్టి... మూడు నెలలకు సమానంగా ఒకేలా ఎలా లెక్కిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయి ఉన్నామంటే... ఇప్పుడు ఈ బిల్లులతో మరింత కుంగిపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మేమెందుకు కడతాం..?
కరోనా సమయంలో లాక్డౌన్లో వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికీ ఈ బిల్లుల బాధలు తప్పడం లేదంటున్నారు. ముఖ్యంగా అద్దెకు ఉంటున్న వారికి అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. గతంలో అద్దెకు ఉన్న వారు ఏసీలు వాడి ఉంటే... కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఎవరో గత ఏడాది వారిన బిల్లులు తామెలా కడుతామని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఫిర్యాదులు విద్యత్ శాఖ అధికారులకు సైతం వస్తున్నాయి. ఐతే... వాటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
సాంకేతిక ఆధారం లేకుండా... మూడు నెలల బిల్లులు ఒకే సారి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నష్టపోతున్నామని వినియోగదారులు విద్యుత్ శాఖపై మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకేసారి భారీగా బిల్లులు వస్తే... పేద, మధ్య తరగతి వారు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్దతిలో కట్టేలా ప్రత్యామ్నాయ పద్దతులు ఆలోచించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా