PSLV C53 Success: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మొదటిసారిగా పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) నాలుగో దశ భూమి చుట్టూ తిరిగుతూ ఉండేలా నూతన సాంకేతికతను రూపొందించి శాస్త్రవేత్తలు తమ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి53 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. అనంతరం మొదటిసారిగా పీఎస్4 (నాలుగోదశ) భూమి చుట్టూ తిరగనుంది. ఇందుకుగాను ఎన్‌జీసీ వ్యవస్థను ఉపయోగించి వైఖరి స్థిరీకరణ చేయనున్నారు. అది కక్ష్యలోనే తిరుగుతూ అక్కడే శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనుంది. శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన నూతన సాంకేతికతను పొందుపరిచారు. మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకుని వివిధ పరిశోధనలు చేపడుతుంది.
గగన్‌యాన్‌కు మరికొంత సమయం..
ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్‌ఎల్‌వీలతోనూ వాణిజ్య ప్రయోగాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు, 2023 జనవరిలో జీఎస్‌ఎల్‌వీ-మార్క్3 ప్రయోగాలు చేపట్టాలని నిర్ణయించామని, ఇవి వాణిజ్య పరమైనవని వివరించారు. చంద్రయాన్-3 వచ్చే ఏడాది చేపట్టనున్నామని, గగన్‌యాన్ ప్రయోగానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం జులై నెలాఖరులో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మరో మూడు రాకెట్ ప్రయోగాలు చేయనున్నామని తెలిపారు. అన్ని పరీక్షలు పక్కాగా నిర్వహించాక గగన్‌యాన్ మానవ రహిత ప్రయోగం వచ్చే ఏడాది చేపట్టనున్నామని తెలిపారు. ఇలా మూడింటిని జరిపిన తర్వాత నాలుగో ప్రయోగంలో వ్యోమగాములను పంపుతామని వివరించారు. పీఎస్‌ఎల్‌వీ-సి53 నాల్గో దశ కక్ష్యలో కొన్ని కవితలను రాయబోతుందన్నారు. ఇది ప్రైమరీ మిషన్ కంప్యూటర్‌ను మరొక కంప్యూటర్‌కు స్వాధీనం చేసుకున్న తర్వాత పీవోఈఎం పనిచేస్తుందని ఆయన చెప్పారు..
ఇస్రోకి ముఖ్యమంత్రి అభినందనలు.. పీఎస్‌ఎల్‌వీ-సి 53 ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రోకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: