గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆస్తి పన్నుల వసూళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో గడిచిన 7 నెలల్లో కొంత వరకు పన్ను వసూలైనా... మొండి బకాయిలు మాత్రం రావడం లేదు. 2019-20 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 8 లక్షల 3 వేల 865 యాజమానుల నుంచి రూ. 938.70 కోట్ల వసూలయ్యాయి.
ఈ ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 9 లక్షల 23 వేల 988 యాజమానుల నుంచి ఆస్తి పన్నులు రూ. 1136.74 కోట్ల వసూలైంది. ఇందులో ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా పన్నులో 5 శాతం రాయితీ ఇవ్వడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో 5 లక్షల 20 వేల 477 యాజమానుల నుంచి రూ. 573.42 కోట్ల వసూలయ్యాయి. వన్ టైం సెటిల్ మెంట్ స్కీంలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లక్షా 10 వేల 442 మంది యాజమానులు రూ.248.03 కోట్లు చెల్లించారు.
వన్ టైం స్కీంతోనూ లాభం లేదు
2020 మార్చి వరకు ఉన్న ఆస్తి పన్నుపైన ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీం ప్రవేశపెట్టింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు అవకాశం కల్పించినా ఆశించినా ఫలితాలు రాకపోవడం వల్ల ఈ పథకాన్ని ఈ నెల 15 వరకు పొడిగించింది. గ్రేటర్లో బకాయిల వసూళ్లకు పరిష్కార మేళాలు ఏర్పాటు చేసినా... క్షేత్ర స్థాయిలో అధికారులు తిరిగినా బకాయిలు వసూల్ కాలేదు. ఈ సారైనా మెండి బకాయిల వసూళ్లను మరింత పకడ్బందీగా చేయాలని బల్దియా నిర్ణయించింది. కానీ ధరణి సర్వే, వరదలు, సహాయక చర్యలు, ఇప్పుడు ఎన్నికల పనులు ఉండడం వల్ల రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. వడ్డీతో కలిపి గ్రేటర్లో మొత్తం రూ.1547.10 కోట్ల మొండి బకాయిలు వసూలు కావల్సి ఉండగా... కేవలం రూ.248.03 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారు. గ్రేటర్లో మొత్తం 5.41 లక్షల యాజమాన్యాలు ఆస్తి పన్ను వడ్డీమాఫీ పథకానికి అర్హులుగా జీహెచ్ఎంసీ తేల్చింది. ఇందులో నుంచి ఇప్పటి వరకు లక్ష మంది యజమానులు మొండి బకాయిలు చెల్లించారు.
ఆస్తి పన్ను మేళాలు
జంట నగరాల్లో మొత్తం 16 లక్షల 39 వేల 238 ఆస్తి పన్ను కట్టే నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో గృహ నివాసాలతో పాటు... వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 11 లక్షల యాజమాన్యాల వరకు ఆస్తి పన్ను ప్రతి ఏటా చెల్లిస్తుంటారు. ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను మేళాలు నిర్వహించింది.
పొడిగించినా.. ఫలితాలు కష్టమే
క్షేత్రస్థాయిలో అధికారులు టార్గెట్ నిర్దేశించి పన్ను వసూళ్లను రాబట్టినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. లక్ష రూపాయలు ఉన్న బకాయిదారులతోపాటు వెయ్యి, ఐదు వేల మధ్య పన్ను చెల్లించాల్సిన వారు కొన్నాళ్లుగా స్పందించడం లేదు. బకాయిలు ఉన్న ఆస్తుల్లో అధిక శాతం వివాదాల్లో ఉంటున్నాయని... కోర్టు కేసుల్లో ఉండడం వల్ల వారు బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 15 తేదీ వన్ టైం సెటిల్మెంట్ పొడిగించినా ఆశించిన ఫలితాలు కనిపించేలా లేవు.