ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. తితిదే ఛైర్మన్ మాటను గౌరవించి స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విచారణలో నిర్దోషిగా తేలిన తర్వాతే మళ్లీ పదవి చేపడతానని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన ఆయన... ఫేక్ వాయిస్‌తో ఇంతటి కుట్ర చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు.
ఎస్వీబీసీ ఉద్యోగులతో తనకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించాననేది అవాస్తవమని అన్నారు. సీఎం జగన్‌కు దగ్గరయ్యాననే అక్కసుతోనే తనపై కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. తుళ్లూరులో ధర్నా చేసే అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని తాను అనలేదని పృథ్వీ చెప్పారు. బినామీ ముసుగులో ఉన్న కార్పొరేట్ రైతులను మాత్రమే అన్నానని వివరించారు.
విచారణకు ఆదేశం
ఆడియో టేపుల వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పూర్తి స్థాయి విచారణ చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్